01-12-2025 04:20:08 PM
తృటిలో తప్పిన పెను ప్రమాదం
శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున సుమారుగా మూడు గంటల సమయంలో వెల్వర్తి గ్రామ శివారులో తాండూరు నుండి బాచుపల్లి వెళ్లే సిమెంట్ ట్యాంకర్ మూలమలుపున అదుపుతప్పి బోల్తా పడినట్లు ట్యాంకర్ డ్రైవర్ తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్ల లేదని పేర్కొన్నారు.
అయితే స్థానికులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎటుచూసినా రోడ్లు బాగా లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. చేవెళ్ల నుండి శంకర్పల్లి మీదుగా బాంబే హైవే అయినప్పటికీ ఎటు చూసినా ఎక్కడ చూసినా మూల మలుపు గుంతల మయంగా ఉండడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య చరువ తీసుకొని వెంటనే రహదారి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.