11-02-2026 12:18:33 PM
జనగామ,(విజయక్రాంతి): జనగాం, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డాక్టర్ సయ్యద్ అమ్రిన్ దంపతులు
జనగాం లోని సెయింట్ మేరీస్ స్కూల్ లో తమ ఓటు హక్కు ను ఉపయోగించుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, ర్యాంపులు, వీల్‌చైర్లు తదితర మౌలిక సదుపాయాలు సమృద్ధిగా కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతోందని అన్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుందని, అర్హులైన ప్రతి ఓటరు ఆలస్యం చేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పిలుపునిచ్చారు.