15-12-2025 12:14:02 AM
గద్వాల, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. ఆదివారం మల్దకల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి కలెక్టర్ లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్లో పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని అన్నారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించి, తరువాత వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్లను వేరుచేసి క్రమపద్ధతిలో ఓట్లను లెక్కించాలని అధికారులను ఆదేశించారు. అన్ని వార్డుల లెక్కింపులు పూర్తయ్యాక సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను కలిపి అభ్యర్థుల వారీగా లెక్కించాలని స్పష్టంగా సూచించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సమన్వయం సమర్థవంతంగా సాగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ శాంతియుత వాతావరణంలో సాగుతుం దని తెలిపారు. కౌంటింగ్ అనంతరం పోలింగ్ సామాగ్రిని రిసెప్షన్ కౌంటర్లో అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగ రావు, డిఎస్పి మొగిలయ్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.