13-01-2026 08:56:32 PM
ఆర్మూర్,(విజయక్రాంతి): అన్ని హంగులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఎంపిక చేసిన స్థలాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. ఆర్మూర్ శివారులోని పిప్రి రోడ్డులో గల స్థలంతో పాటు, అంకాపూర్ శివారులోని స్థలాన్ని స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం, రవాణా సదుపాయం, విద్యార్థులకు ఏ మేరకు భద్రత ఉంటుంది. నేల స్వభావం తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. సమగ్ర సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని అన్నారు. ఇప్పటికే మంజూరీలు తెలుపబడిన ఆయా నియోజకవర్గాలలో వీటి నిర్మాణాలు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగం సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.