20-12-2025 07:15:32 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భవిత కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నాణ్యమైన విద్య, తెరపి, మార్గదర్శక సేవలు అందించేందుకు భవిత కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భవిత కేంద్రం ప్రత్యేక అవసరాల పిల్లల విద్య, మానసిక, సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి, వారికి తగిన సహాయం అందించడమే భవిత కేంద్రాల లక్ష్యమని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జ్ విద్యాధికారి మాట్లాడుతూ సమగ్ర శిక్షా అభియాన్‌లో భాగంగా భవిత కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, అకడమిక్ సపోర్ట్ అందించడం జరుగుతుందని, పిల్లలను ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి ప్రత్యేక అవసరాల పిల్లవాడికి భవిత కేంద్రం సేవలు అందేలా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. తల్లిదండ్రుల సహకారంతో పిల్లల భవిష్యత్తును మరింత బలపరిచేలా కృషి చేస్తున్నామని తెలిపారు.