calender_icon.png 20 December, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు యూరియా సరఫరా సులభతరం చేయడానికి ప్రత్యేక మొబైల్ యాప్

20-12-2025 07:23:58 PM

జిల్లా పాలనాధికారి ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): రబీ సీజన్ ప్రారంభం నేపథ్యంలో రైతులకు యూరియా పంపిణీ, అమ్మకాలను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టిందని  జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ యాప్‌ను డిసెంబర్ 22 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పై సంబంధిత వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సమావేశం నిర్వహించారు.

ఈ యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలని, రైతువేదికల్లో శిక్షణ ఇచ్చి  రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.ఈ యాప్ ద్వారా రైతులు ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదనీ , రైతులు తమకు నచ్చిన డీలర్‌ను ఎంచుకుని ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. రైతులు తమ భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని సమీప డీలర్‌తో పాటు జిల్లాలోని ఏ ఇతర అనుకూలమైన డీలర్ వద్దనైనా యూరియాను బుక్ చేసుకోవచ్చు.

అలాగే డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. యూరియాను బుక్ చేసిన తర్వాత రైతు మొబైల్ ఫోన్‌కు ప్రత్యేక బుకింగ్ ఐడీ పంపబడుతుందని, ఆ ఐడీ ఆధారంగా సంబంధిత డీలర్ వద్ద యూరియా స్టాక్‌ను పొందవచ్చన్నారు.యాప్‌ను టోకెన్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి వినియోగంలోకి తీసుకురావచ్చు. యాప్ వినియోగంలో ఏవైనా సందేహాలు ఉంటే, డీలర్ పాయింట్ల వద్ద అందుబాటులో ఉన్న వాలంటీర్లను సంప్రదించవచ్చు.

ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో “Fertilizer Booking App” పేరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

లింక్: https://play.google.com/store/apps/details?id=com.org.nic.agri.urea

ఈ యాప్‌లో రైతులు/పౌరులు, డిపార్ట్మెంటల్ అధికారులు, డీలర్లకు వేర్వేరు లాగిన్ సౌకర్యాలు ఉంటాయి. రైతులు పట్టాదార్ పాస్ బుక్ నంబర్ , సంబంధిత సీజన్‌లో సాగు చేసే పంటల విస్తీర్ణం ఆధారంగా యూరియాను బుక్ చేసుకోవాలి. రైతులకు అవసరమైన మేరకు యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధిలో ఒకటి నుంచి నాలుగు దశల్లో సరఫరా చేస్తారు. పట్టాదార్ పాస్బుక్ లేని రైతులు (కౌలు రైతులు తదితరులు) తమ ఆధార్ నంబర్ ద్వారా కూడా యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.ఈ సందర్భంగా ఫర్టిలైజర్ బుకింగ్ యస్ ను రైతులు డౌన్ లోడ్ చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశం లో వ్యవసాయ శాఖ అధికారి, ఫ్యాక్స్ అధికారి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.