09-12-2025 03:33:08 PM
అక్రమాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలి
అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ఆవరణలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి అవినీతి నిరోధక దినోత్సవం ను పురస్కరించుకొని విజిలెన్స్ వారోత్సవాలు పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉంటూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. మనమంతా నిబద్ధతతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, అవినీతి అక్రమాల నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలను ఎవరైనా లంచం ఇవ్వమని వేధిస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం ప్రజల హక్కు అని, ఆ హక్కును లంచం తో కొనవద్దని, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏ పని కోసం ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రజలకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.