24-01-2026 03:35:13 PM
పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతుల నిర్వహణ
సుల్తానాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందెలా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలంలోని పూసాలలోని ఎంపిపిఎస్, పల్లె దవాఖానా, భూపతి పూర్ లోని కేజీబీవీ, బీసీ బాలుర గురుకుల పాఠశాల, సుల్తానాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా, గర్రెపల్లి లోని ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలలనుపరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ భూపతి పూర్ కేజిబీవీ లోని 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహించి ప్రతి ఒక్కరికి 90 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేజిబీవీ కాంపౌండ్ వాల్, మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని అన్నారు. పూసాల ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రాథమిక విద్యార్థుల కు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేశారు. ప్రాథమిక విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. ఎఫ్.ఆర్.ఎస్ విధానం ద్వారా హాజరు నమోదు చేయాలని అన్నారు.
పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ అమలు పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. గర్రెపల్లి లోని ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలలో జరుగుతున్న పర్యావరణ పరీక్షను కలెక్టర్ పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని, రాబోయే పబ్లిక్ పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా రెగ్యులర్ స్టడీ అవర్స్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సుల్తానాబాద్ లో అంబేద్కర్ చౌరస్తా నుంచి గట్టెపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.
రోడ్డు విస్తరణ పనులు సజావుగా నిర్వహించాలని, విస్తరణ లో భాగంగా ఇండ్లు కోల్పోయిన ప్రజలను తరలించి పాత ఇండ్ల కూల్చివేత పనులు రెండు రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. సుల్తానాబాద్ ఆసుపత్రి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని కల్పన, సుల్తానాబాద్ తాహసిల్దార్ బషీరుద్దీన్, మున్సిపల్ కమిషనర్ రమేష్, ఎంపీఓ సమ్మిరెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ రవి కిరణ్, ఏఈ గుణ శేఖర్ రెడ్డి, కేజీబీవి స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ఏఈపిఆర్ ,బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.