calender_icon.png 23 January, 2026 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కోడు ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వీ పాటిల్

23-01-2026 12:00:00 AM

ఆళ్లపల్లి, జనవరి 22 (విజయక్రాంతి): మార్కోడు గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ తదితర మౌలిక వసతులను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. మరుగుదొడ్ల పరిశీలన సమయంలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, తక్షణమే చర్యలు తీసుకొని నిరంతర నీటి సరఫరా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో పాఠశాల భవనంలో లికేజీ సమస్య ఉన్నట్లు ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, అవసరమైన మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

డైనింగ్ హాల్ను పరిశీలించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్లు, వంట నిర్వహణ విధానాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు శుభ్రమైన, పోషకాహారంతో కూడిన రుచికరమైన భోజనం తప్పనిసరిగా అందించాలని, వంట సిబ్బంది పరిశుభ్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

వంటకట్టెలపై ఆధారపడుతున్న పరిస్థితిని గమనించిన కలెక్టర్, గ్యాస్ సరఫరా ఏర్పాట్లకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షిత వాతావరణంతో పాటు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, పోషకాహారం తప్పనిసరిగా అందాలని తెలిపారు. పాఠశాలల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం వహించరాదని, చిన్న లోపం కూడా విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రధానోపాధ్యాయులు ముత్తయ్య, రామకృష్ణ, బోధన, బోధనీ తర సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.