20-08-2025 10:11:39 PM
గద్వాల: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గద్వాల్ జిల్లా, గోనేపాడు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (KGBV) జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ సభ్యులు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు చట్టసంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికల హక్కులు, బాల కార్మిక నిషేధ చట్టం, బాల్యవివాహాలు, POCSO చట్టం తదితర అంశాలపై వివరంగా తెలియజేశారు. న్యాయ సహాయం పొందే విధానం, లీగల్ ఎయిడ్ సేవలు ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై స్పష్టతనిచ్చారు.
విద్యార్థినులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పలు సందేహాలు అడిగి తగిన సమాచారం పొందారు. ఈ కార్యక్రమం వారి చట్టపరమైన అవగాహనను పెంచడమే కాకుండా, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించింది. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ మాట్లాడుతూ, డ్రాప్‌ఔట్స్ (విద్యార్థుల చదువు మానేసే సమస్య) తగ్గించడమే కాకుండా, పాఠశాల హాజరును పెంచడం అత్యంత అవసరం. పిల్లలు చదువు మానకుండా ప్రతిరోజూ పాఠశాలకు రావడం చాలా ముఖ్యం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం కలిసి విద్యపై అవగాహన కలిగించాలి.
విద్యా ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రత్యేక శిబిరాలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. బాలల హక్కుల గురించి తెలియజేసే కార్యక్రమాలు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ప్రభుత్వం అందించే సౌకర్యాలు, స్కాలర్‌షిప్‌లు, మిడ్‌డే మీల్స్ వంటివి సరైన రీతిలో అమలులోకి వస్తే పిల్లలు పాఠశాలకు హాజరు కావడానికి ప్రోత్సాహం లభిస్తుంది. గ్రామస్థాయి నుండి విద్యాపై సానుకూల దృక్పథం పెంపొందితే తప్పకుండా డ్రాప్‌ఔట్ రేటు తగ్గి హాజరు శాతం పెరుగుతుంది.