20-08-2025 10:17:04 PM
గద్వాల,(విజయక్రాంతి): రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు సాగు చేసిన పంటల విస్తీర్ణం,యూరియా నిల్వలు, విక్రయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో నిలువగా ఉన్న 543 మెట్రిక్ టన్నుల యూరియాను పద్ధతి ప్రకారంగా అవసరం ఉన్న రైతులకి పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాకు వచ్చే కొత్త యూరియా నిల్వలను పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే రైతులకు అందజేయాలని, ఇతర ఆగ్రో షాపులకు వాటిని కేటాయించరాదని ఆయన స్పష్టం చేశారు. గత సంవత్సరం యూరియా వినియోగ వివరాలను ఈ ఏడాది రికార్డులతో పోల్చి, అసాధారణంగా అధికంగా వినియోగం చూపిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రిటైల్ షాపులపై తప్పనిసరిగా విచారణ జరిపి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 600 మెట్రిక్ టన్నుల యూరియాను ఎక్కువగా విక్రయించడం జరిగిందని, అయినప్పటికీ యూరియా కొరతకు గల కారణాలపై కలెక్టర్ సవివరంగా విచారణ నిర్వహించారు. యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకూడదని, ఎరువులు పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ హెచ్చరించారు.
రైతులు కూడా తమకు అవసరమైనంత మేరకే ఎరువులు తీసుకోవాలని సూచించారు. కొత్తగా వచ్చే స్టాక్ ను కచ్చితంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేయాలని, ఒకసారి తీసుకున్న రైతులు మళ్లీ మళ్లీ తీసుకోకుండా చూడాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద ఒక వ్యవసాయ విస్తీర్ణన అధికారిని నియమించి యూరియా సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని ఆదేశించారు.