07-08-2025 08:48:47 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష..
హనుమకొండ (విజయక్రాంతి): భూసమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో భూభారతి దరఖాస్తుల విచారణ, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లను ఎన్నెన్ని దరఖాస్తులకు ఎన్ని నోటీసులు ఇచ్చారు, ఎన్ని విచారణ చేశారు, ఇప్పటివరకు ఎన్నింటిని పరిష్కరించారనే వివరాలను, ఒక్కరోజుకు ఎన్ని పరిష్కరిస్తున్నారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, వచ్చిన దరఖాస్తులలో విచారణ నిర్వహించి త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి రోజు కనీసం పది దరఖాస్తులపై విచారణ చేయించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె. నారాయణ, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
హనుమకొండ కుడా ఆఫీస్ సమీపంలోని హనుమకొండ ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కరించటానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీవో రాథోడ్ రమేష్, ఇతర అధికారుల తో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాల నుండి ఆర్డీవో కార్యాలయానికి వచ్చే భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.