07-08-2025 10:49:20 PM
రాష్ట్రవ్యాప్తంగా భూభారతి రెవెన్యూ, వ్యవసాయం, విత్తన చట్టాలపై రైతులకు అవగాహన..
రెవెన్యూ చట్టాల న్యాయ నిపుణులు భూమి సునీల్..
నేరేడుచర్ల మండలంలో భూభారతి చట్టంపై అవగాహన..
హుజూర్ నగర్/నేరేడుచర్ల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం దేశంలోనే గొప్ప చట్టం అని భూమి, రెవెన్యూ చట్టాల న్యాయ నిపుణులు భూమి సునీల్ అన్నారు. గురువారం లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెంట్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ(Legal Empowerment and Assistant for Farmers Society) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాగు న్యాయ యాత్రలో నేరేడుచర్ల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూభారతి రెవెన్యూ, వ్యవసాయం, విత్తన చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విత్తనాలకు సంబంధించి 50 చట్టాలు ఉన్నాయని, 25 చట్టాలు రాష్ట్ర పరిధిలో, మరో 25 చట్టాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని వెల్లడించారు.
విత్తన చట్టాలు మొత్తం 174 వరకు ఉన్నాయని, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు నష్ట పరిహారము పొందాలంటే విత్తనాలు కొన్న రసీదు, సంబంధిత వివరాలు ఉండాలన్నారు. విత్తనాలు అమ్మాలంటే సీడ్ లైసెన్స్ ఉండాలని,లైసెన్స్ ఉన్న షాపులోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. భూమికి సంబంధించిన అన్ని సమస్యలు కోర్టుకు వెళ్లకుండానే రెవెన్యూ అధికారుల పరిధిలోనే పరిష్కారమవుతాయన్నారు. రైతులు భూ చట్టాలు, హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
అంతకు ముందు రైతులు భూమికి సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. భూదాన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... రైతులు తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరారు.పురుగు మందులు విపరీతంగా ఉపయోగించటం వల్ల మట్టి విషతుల్యమైందని విచారం వ్యక్తం చేశారు.విషపూరితమైన మట్టిలో పండిన పంటలు విషపూరితమై ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. నకిలీ విత్తనాలు వాడకుండా లోకల్ సీడ్స్ వాడాలన్నారు. తెలంగాణ విత్తనాలు మేలు రకంగా ఉంటాయని, రైతులు వాటినే వాడాలని సూచించారు. ఈ సమావేశంలో నేరేడుచర్ల తహసీల్దార్ సురిగి సైదులు,డివిజన్ వ్యవసాయ శాఖ సంచాలకుడు రవి,మండల వ్యవసాయ అధికారి జావీద్,పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.