07-08-2025 11:22:10 PM
ఘనంగా ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి..
గరిడేపల్లి (విజయక్రాంతి): "భూ తల్లి బిడ్డలు చిగురించు కొమ్మలు చిదివేసిన పువ్వులు త్యాగాల గొంతులు మా భూములు మాకే నంటూ" తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన గద్దర్ త్యాగం మరువలేనిదని ప్రజా కళాకారుడు బాదే నరసయ్య అన్నారు. ప్రజా గాయకుడు స్వర్గీయ గద్దర్ రెండవ వర్ధంతిని గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల సమస్యల పరిష్కారం కోసం, తన పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆలపించిన ప్రతి పాటలో ప్రజా చైతన్యం కళ్ళకు కట్టినట్టు కనిపించేదని తెలిపారు. ఎంతోమంది ప్రజా గాయకులకు కళాకారులకు ఆయన ఆదర్శంగా నిలిచారని తెలిపారు. తుదిశ్వాస విడిచే వరకు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగిన వీరుడని ఆయన కొనియాడారు.
ప్రజా చైతన్యం కోసం ఆయన నడిచే బాటలో ఎన్నో ఇబ్బందులు వడుదుడుకులు ఆటుపోట్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొంటూ ప్రజల్లో చైతన్యం నింపిన కళాకారుడని ఆయన పేర్కొన్నారు. నేడు ఎంతోమంది ప్రజా గాయకులు కళాకారులు తయారయ్యారు అంటే దానికి గద్దర్ స్ఫూర్తి దాయకమని తెలిపారు. పాలకుల తీరును ఎండ గట్టడంలో, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకు రావడం కోసం తాను పాడిన పాటనే ఆయుధంగా తయారు చేసుకున్నారని తెలిపారు. గద్దర్ ఆలపించిన పాట లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పాలకుల అనుసరిస్తున్న తీరు కళ్ళకు కట్టినట్లు ఉండేదని తెలిపారు. కళారూపాలను ప్రదర్శించడంలో, చైతన్యవంతమైన పాటలను ఆలపించడంలో ఆయనకు ఆయనే సాటి అని,అలాంటి గాయకులు అరుదుగా ఉంటారని ఆయన తెలిపారు.గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కళాకారులు మైబు,తిరపమ్మ, వీరస్వామి,జ్యోతి,ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.