calender_icon.png 25 August, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి

25-08-2025 05:19:29 PM

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా నలుమూలల నుండి ప్రజలు ఫిర్యాదులను సమర్పిస్తారని, అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలను ఫిర్యాదు దారుకు తెలియజేయాలని చెప్పారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడం వల్ల ఫిర్యాదుదారులకు మేలు జరుగుతుందని  అన్నారు.

జిల్లా స్థాయిలో పరిష్కారం కాని వాటిని పై స్థాయికి  పంపించాలని, ఆ విషయాన్ని ఫిర్యాదుదారుకు తెలియజేయాలని చెప్పారు. ప్రజావాణి ఫిర్యాదులతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులను కూడా సకాలంలో పరిష్కరించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఎక్కడ జాప్యం చేయొద్దని, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఇదే వరవడిని కొనసాగించాలని చెప్పారు. కాగా ఈ సోమవారం మొత్తం 85 ఫిర్యాదులు రాగా, వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 50, ఇతర శాఖలకు సంబంధించి 35 పీర్యాదులు వచ్చాయి.