calender_icon.png 25 August, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాసంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్ చర్యలు

25-08-2025 05:25:32 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): విద్యాసంస్థల్లో ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణపై అవగాహన కల్పించారు. విద్యాసంస్థలలో ర్యాగింగ్ కు పాల్పడడం తీవ్రమైన నేరంగా  పరిగణించబడుతుందన్నారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్ విద్యార్థుల పట్ల అసాంఘిక ఆకృత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ర్యాగింగ్ కు పాల్పడితే విద్యార్థుల విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుందన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ను అరికట్టడానికి యాజమాన్యం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఇందులో భాగంగా ప్రతి విద్యాసంస్థలు యాంటీ ర్యాగింగ్ కమిటీ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాలలో నూతనంగా వచ్చిన విద్యార్థులను ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించారు. విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులపై ఎటువంటి వేధింపులు, దౌర్జన్యాలు, అసభ్య కార్యకలాపాలకు పాల్పడవద్దని కోరారు.

ర్యాగింగ్ కు గురైతే ప్రిన్సిపాల్ కు లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు కలసి పనిచేసినప్పుడే ర్యాగింగ్ సంస్కృతిని నిర్మూలించగలగమన్నారు. ర్యాగింగ్ కు గురైతే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ర్యాగింగ్ కు సంబంధించిన సమాచారాన్ని తెలిపేందుకు శ్రీనివాసరావు సీఐ బెల్లంపల్లి వన్ టౌన్ (8712656559), ఎస్సై హైమ (8712581092),హెడ్ కానిస్టేబుల్ స్వప్న (8712580662) మొబైల్ నెంబర్ లలో సంప్రదించాలని సిఐ శ్రీనివాసరావు కోరారు.