25-08-2025 07:52:27 PM
యూరియా కేంద్రం వద్ద రైతుల ఆందోళన.
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలం కేంద్రంలోని మండల మహిళ సమైక్య కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా సంచులు పంపిణీ చేయాలని వందల మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. రైతులకు సరిపడా సంచులు లేవని సమైక్య కేంద్రం సిబ్బంది చెప్పడంతో రైతులకు సిబ్బందికి వాగ్వాదం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు సర్దు చెప్పడంతో శాంతించారు.టోకెన్ ఇచ్చిన వారికి ఇస్తామని ఒకసారి క్యూ వరసలో వచ్చిన వారికి ఇస్తామని అనడం అయోమయానికి గురిచేశారని రైతులు మండిపడ్డారు. యూరియా కోసం ఇచ్చిన ఆధార్ కార్డులను పడేశారని, రెండవ దశలో చల్లాల్సిన యూరియా మొదటి దశలో చల్లడానికి కూడా ఇంకా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత సీసీ శోభన్ బాబును వివరణ కోరగా.. స్టాక్ రాగానే అందరికీ అందిస్తాం. ప్రస్తుతం మన దగ్గర 140 బస్తాలు ఉన్నాయి. ఒక ఆధార్ కార్డు పై ఒక రైతుకు ఒక్కటే బ్యాగు ఇస్తాం.,అందరు వరస క్రమంలో రావాలి.ఒకవేళ యూరియా రాని వారికి మిగతా స్టాకు రాగానే అందజేస్తాం.సరఫరా ఆలస్యం కావడంతో ఈ సమస్య వచ్చింది. రైతులందరికీ అందజేస్తాం ఎవరు ఆందోళన చెందవద్దు.రైతుల ఆధార్ కార్డులు మేము ఎక్కడ పడేయలేదు.స్టాకు లేదని చెప్పినా రైతులు తమ ఆధార్ కార్డులు వరుస క్రమంలో పెట్టారు.వాటిని వెతుక్కునే క్రమంలో గందరగోళం నెలకొంది.