calender_icon.png 22 July, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్పోల్ తండాను సందర్శించిన కలెక్టర్

22-07-2025 12:02:01 AM

వైద్య శిబిరం ఆకస్మిక తనిఖీ అంటు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్, జూలై 21 :(విజయ క్రాంతి): మోపాల్ మండలంలోని కాల్పోల్ తండాను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. తండాలో పలువురికి జ్వరాలు సోకిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వర పీడితుల వివరాలను, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి అధికారులను వివరాలు తెలుసుకున్నారు.

జ్వరాలు ప్రబలేందుకు గల కారణాలను గుర్తిస్తూ, పరిస్థితి అదుపు తప్పకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జ్వరాలు, ఇతర అనారోగ్య కారణాలతో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. జ్వరం వచ్చిన వెంటనే స్థానికులు వైద్య శిబిరాన్ని సందర్శించి తగిన చికిత్సలు పొందేలా చూడాలన్నారు.

ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల నడుమ నీరు నిలువ ఉండకుండా చూడాలని, పారిశుధ్య సమస్య నెలకొనకుండా శానిటేషన్ పనులు జరిపించాలన్నారు. మురికి కాల్వలు, నీరు నిలువ ఉన్న ప్రదేశాలలో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, ప్రతి ఇంటిని సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అన్నారు.

జిల్లాలో ఎక్కడ కూడా జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా తండాలోని ఆయా నివాస ప్రాంతాలను సందర్శిస్తూ, స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ అధికారి డాక్టర్ తుకారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మోపాల్ ఎంపీడీఓ రాములు, ఎంపీఓ కిరణ్ తదితరులు ఉన్నారు.