calender_icon.png 20 August, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా పక్కదారి పట్టకుండా రైతులకు అందే విధంగా చూడాలి

19-08-2025 10:34:49 PM

జిల్లా ఇంచార్జి కలెక్టర్ విజయిందిర బోయి

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో యూరియా పక్కదారి పట్టకుండా  రైతులకు అవసరమైన మేరకు అందే విధంగా చూడాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ విజయిందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్ శాఖ అధికారులతో  యూరియా పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో  ప్రస్తుతం 2500 మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర కాంప్లెక్ ఎరువులు నిల్వ ఉన్నాయని, క్రమం తప్పకుండా యూరియా వస్తుంది కాబట్టి రైతులు అనవసరంగా ఆందోళన పడి అవసరానికి మించి కొనాల్సిన అవసరం లేదన్నారు. మునుముందు యూరియా దొరకదనే ఆలోచనతో రైతులు ఎగబడి కొనాల్సిన అవసరం లేదని యూరియా ప్రతి వారం వస్తూనే ఉంటుందన్నారు.

ఈ విషయాన్ని రైతులకు అవగాహన కల్పించి ప్రస్తుతం ఉన్న అవసరం మేరకు మాత్రమే కొనుక్కునే విధంగా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు.  అదేవిధంగా క్రమం తప్పకుండా యూరియా కొంటున్న వారి వివరాలు వారికి అమ్ముతున్న వారి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.   యూరియా రైతుల వ్యవసాయ సేద్యానికి తప్ప ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోను తరలించడానికి వీలు లేదని తెలిపారు.  పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ యూరియా డీలర్ షాపులను, సొసైటి గోదాములు తనిఖీ చేస్తూ ఉండాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ పై టాస్క్ ఫోర్స్ ద్వారా ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.