calender_icon.png 22 July, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ యాప్‌ల కేసులో విచారణకు రండి

22-07-2025 01:11:10 AM

- టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ పిలుపు

- గూగుల్, మెటాలకు మరోసారి..

- మొత్తం 29 మందికి నోటీసులు

- సమన్లు జారీ చేసిన ఈడీ 

- మనీలాండరింగ్ కేసులో ముమ్మర దర్యాప్తు 

- నోటీసులు అందుకున్న వారిలో రానా, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తును ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ అన్ని కోణాల్లో ముమ్మరం చేసింది. యాప్‌ల ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులపై దృష్టి సారించిన ఈడీ, అదే సమయంలో వాటి ప్రచారానికి వేదిక కల్పించిన టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోంది.

టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు

ఈ కేసులో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మిలతో సహా మొత్తం 29 మంది నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఈడీ ఆరోపణలు నమో దు చేసింది. వీరిని విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. ఈడీ ఆదేశాల ప్రకారం.. రానా దగ్గుబాటి జూలై 23న, ప్రకాశ్‌రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మీ ఆగస్టు 13న విచారణకు హాజరు కావాల్సి ఉంది.

మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త పి.ఎం. ఫణీంద్ర శర్మ 2025 మార్చి 19న చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సెలబ్రిటీల ప్రచారం వల్ల యువత బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై నటుల బృందాలు స్పందిస్తూ, తాము ప్రమోట్ చేసింది గ్యాంబ్లింగ్ కాదని, సుప్రీంకోర్టు అనుమతించిన స్కిల్-బేస్డ్ గేమింగ్‌కు సంబంధించినవని వివరణ ఇచ్చాయి.

గూగుల్, మెటాలకు మరోసారి సమన్లు

మరోవైపు, ఈ అక్రమ బెట్టింగ్ యాప్‌లకు తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటనల స్థలం కల్పించి, వాటి ప్రచారానికి సహకరించాయన్న ఆరోపణలపై  గూగుల్, మెటా సంస్థలను కూడా ఈడీ విచారిస్తోంది. జూలై 21న విచారణకు హాజరు కావాలని గతంలో ఆదేశించినప్పటికీ, ఆ కంపెనీల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ వారికి మరోసారి నోటీసులు జారీ చేసి, జూలై 28న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ప్రమోషన్లు మరియు ప్రకటనల వెనుక భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. ఒకేసారి సినీ, టెక్ రంగ ప్రముఖులను విచారిస్తున్న ఈ కేసు పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.