calender_icon.png 25 January, 2026 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక బందోబస్తు!

25-01-2026 12:00:00 AM

ఏఐ, డ్రోన్లు, పాన్ టిల్ట్ కెమెరాల ద్వారా నిఘా

30 చ.కి.మీ మేర పర్యవేక్షణ 

జంపన్నవాగు, రద్దీ రోడ్లపై 20కి పైగా డ్రోన్ల పరిశీలన

తప్పిపోకుండా పిల్లలు, వృద్ధులకు క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లు

మహాజాతరకు కమాండ్ కంట్రోల్ రూమ్

జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఏఐ ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. ఇక తాజా గా సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి, జాతరలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు.

మేడారం, జనవరి 24 (విజయక్రాంతి): తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే మహా జాతరకు 3 కోట్ల వరకు భక్తులు వస్తారని అంచనా వేసింది. ఇందుకు తగ్గట్టుగానే భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర ఇబ్బందులను నియంత్రించడానికి పోలీసుశాఖ ఈసారి మేడా రం జాతరలో ‘ఆధునిక’ సాంకేతికతను వినియోగంలోకి తెస్తోంది. 

టీజీ క్వెస్ట్ అత్యాధునిక డ్రోన్ వ్యవస్థ

మేడారం జాతరలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ఎవరూ తప్పిపోకుండా జాతర భద్రతను పర్యవేక్షించేందుకు ‘టీజీ-క్వెస్ట్’ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ ద్వారా 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ రోడ్లపై 20కి పైగా డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా పెడుతున్నారు.

నిఘాలో 13 వేల మంది పోలీస్ సిబ్బంది విధులు

అవి మాత్రమే కాకుండా హీలియం బెలూన్లకు అమర్చిన పాన్ టిల్ట్ జూమ్ కెమెరాలు పై నుంచి రద్దీని విశ్లేషిస్తాయి. దాదాపు 13 వేల మంది పోలీసు సిబ్బంది ఈ టెక్నాలజీ సర్వైలెన్స్‌లో విధులు నిర్వహించనున్నారు. వచ్చిపోయే భక్తులను సాంకేతిక నిఘాలో ప్రతీక్షణం పర్యవేక్షించనున్నారు.

జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్

ఈసారి మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులు తప్పిపోకుండా పోలీసులు పటిష్టమైన చర్యలను చేపడుతున్నారు. గత జాతరలో దాదాపు 30 వేల మంది వరకు తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ వ్యవస్థను తీసుకు వస్తున్నారు. 

క్యూఆర్ కోడ్ గల జియో ట్యాగ్లతో చర్యలు

పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్లను కడతారు. ఒకవేళ తప్పిపోయినా ఈ ట్యాగ్‌ను స్కాన్  చేస్తే  పూర్తి వివరాలు తెలుస్తాయి. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేస్తున్నారు.

ప్రత్యేకంగా 12 క్రైమ్ బృందాలు

తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళ భాషల్లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యే కంగా 12 క్రైమ్ బృందాలు ఏర్పాటు చేశారు. పాతనేరస్థుల గుర్తింపునకు ఆసుపత్రి, పార్కింగ్ స్థలాల వద్ద ‘ఫేస్ రికగ్నిషన్’ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.