calender_icon.png 7 July, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిహారం ప్రశ్నార్థకం!?

07-07-2025 01:13:36 AM

- డీఎన్‌ఏ పరీక్షల్లో తేలినవారే అర్హులా?

- సిగాచీ మృతుల కుటుంబాల్లో ఆందోళన

- ఇప్పటి వరకు 42 మంది మృతి 

- తాజాగా 70 శాంపిల్స్ సేకరణ

- ఆచూకీ లభించని 9 మందిలో ఒకరు మృతి

- మిగిలిన 8 మంది ఆచూకీ నిర్ధారణ ఎలా?

సంగారెడ్డి, జూలై 6 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ కంపెనీలో జరిగిన భారీ పేలుడులో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు జాబితా తయారీలో గందరగోళం నెలకొంది. కొంతమంది మృతుల కుటుంబా లకు పరిహారం ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయి. 

జూన్ 30న జరిగిన పేలుడు దేశ వ్యాప్తం గా సంచలనం సృష్టించింది. ఘటన జరిగి ఏడు రోజులు పూర్తయినా ఇంకా 8 మంది జాడ తెలియడం లేదు. ఇప్పటి వరకు అధికారికంగా 42 మం ది మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ నెల 2న సీఎం రేవంత్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు అండగా ఉంటామని, మృతి చెందిన కుటుం బాలకు ఒక్కొక్కరికి కంపెనీ యాజమాన్యం, ప్రభు త్వం కలిసి రూ.కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా మృతుల కుటుం బాలకు పరిహారం చెల్లింపు వైపు జిల్లా యంత్రాంగం జాబితాను తయారు చేస్తోంది. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతుంది. ఇంకా జాడ తెలియని వారి కుటుంబాలు ఫ్యాక్టరీ వద్ద, ఆసుపత్రుల వద్ద పడిగాపులు పడుతున్నారు. 

నిబంధనలు ఇలా

సిగాచీ పేలుడు ఘటనలో లభించిన మృతదేహాల ఆధారంగానే వారి డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. దీని ఆధారంగానే ప్రభుత్వం పరిహారం చెల్లించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కార్మికశాఖ, కంపెనీ యాజమాన్యం నుంచి ఆ రోజు కార్మికుల జాబితాను అధికారులు సేకరించారు.

దీంతో 143 మంది కార్మికులు ప్రమాదం జరిగినప్పుడు ఉన్నారని స్పష్టం చేశారు. ఇందులో ఆదివారం నాటికి 42 మంది మృతి చెందారు. ఆదివారం మరో 70 శాంపిళ్లను సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. అయితే ఆచూకీ తెలియని కార్మికులు మృతి చెందినట్లు నిర్ధారించే అవకాశం లేకుండా పోతుంది. మృతుల శరీర అవయవాల సేకరణ పనిలో అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఒకవేళ డీఎన్‌ఏ పరీక్షలో జాడలేని కార్మికుల మృతదేహాలు లేనిపక్షంలో వారికి పరిహారం చెల్లింపు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక సమాయాల్లో మాత్రమే ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశం ఉంటుంది. ఆ జీవో ఆధారంగానే పరిహారం అందిస్తారు. సిగాచీ కంపెనీలో జాడలేని మృతదేహాల నిర్ధారణ కానిపక్షంలో వారు మృతి చెందినట్లుగా నిర్ధారించలేరు. వీరికి సైతం అలాంటి ప్రత్యేక జీవో ఆధారంగా పరిహారం చెల్లిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. 

42 కు చేరిన మృతుల సంఖ్య

సిగాచీ ఘటనలో ఇప్పటి వరకు 42 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఆచూకీ లభించని 9 మందిలో ఒకరు మృతి చెందినట్లుగా ఆదివారం ప్రకటించారు. ఇంకా 8 మంది జాడ తెలియడం లేదు. శిథిలాల తొలగింపు కార్యక్రమం దాదాపుగా పూర్తయింది. అయితే మృతుల కు చెందిన ఆనవాళ్లుగానీ, శరీర భాగాలు, ఎముకలు లభిస్తే డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించవచ్చని ప్రయత్నిస్తున్నారు.

ఆదివారం సుమారు 70కి పైగా శాంపిళ్లను పరీక్షలకు పంపించారు. అలాగే ఇప్పటివరకు 36 మృతదేహాలను గుర్తించి వారి బంధువుల కు అప్పగించారు. తాజాగా మరో ఇద్దరి మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించారు. వారిలో సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌కు చెందిన దాసరి రామాంజనేయులు, మహబూబాబాద్‌కు చెందిన ఎంఅఖిల్ ఉన్నారు. ఆచూకీ లేని వారిలో ఎముకల ఆధారంగా డీఎన్‌ఏ పరీక్షల వల్ల మధ్యప్రదేశ్‌కు చెందిన చికెన్ సింగ్‌గా గుర్తించారు. దీంతో మృతుల గుర్తింపు 39కి చేరింది.