calender_icon.png 7 July, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా శ్రేయస్సుకే సంక్షేమ పథకాలు

08-07-2025 12:00:00 AM

- రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలోనే 4.50 లక్షల ఇండ్ల మంజూరు 

- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

- కొత్తగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ 

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 6 (విజయక్రాంతి): ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, చుంచుపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి పంపిణీ చేశారు.

లక్ష్మీదేవిపల్లె మండలం సీతారాంపురం, చింతపెంటగూడెంలో హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ పాలకులు రూ.8.19 లక్షల కోట్ల అప్పుచేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేశామని, రాబోయే రోజుల్లో మిగిలిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం మాదిరిగా ఊహా జనకమైన మాటలు ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పదని స్పష్టం చేశారు. తొలి విడతలో ఇందరమ్మ ఇండ్లు రాని ఆడబిడ్డలెవ్వరు నిరుత్సాహ పడవద్దని రాబోయే విడతల్లో మిగిలిన వారందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలోనే 4.50 లక్షల ఇండ్లు మంజూరు చేశామని, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేసి, అదనంగా మరో 1500 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

భవిష్యత్తులో గుడి లేని గ్రామం ఉంటుందేమో కానీ ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. నాలుగు రోజుల క్రితమే రైతు భరోసా పేరుతో తొమ్మిది రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను ప్రతి రైతు ఖాతాలో వేసిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిది అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ట్రెయినీ కలెక్టర్ సౌరబ్ శర్మ, అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాస్‌రావు, ఆళ్ల మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా పాల్గొన్నారు.