17-12-2025 03:51:05 PM
మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్
మంథని,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు) మండలంలోని కకర్ బుడ్డీ, బాజ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న మావోయిస్టుల అరెస్టును ప్రజలు ఖండించండని మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావరణానికి, ప్రజల అభిష్టానికి ఈ అరెస్టులు ఎదురుదెబ్బ అని! ఫాసిస్టు బీజేపీ రూపొందించిన కగార్ యుద్ధానికి మద్దతునివ్వొదని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నమని, ఇతర ప్రతిపక్ష పార్టీలు, సంఘాలు తెలంగాణలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు నుండి కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని కొనసాగేందుకు వీలుగా ఆందోళనలు చేపట్టాలని కోరారు.
అసిఫాబాద్ జిల్లాలో కొద్దిరోజుల నుండి మావోయిస్టు పార్టీ కార్యకర్తలను పట్టుకునేందుకు అక్కడి జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు సిర్పూర్(యు) మండలంలోని కకర్ బుడ్డీ, బాజ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న మా సహచరులను 16 మందిని అరెస్టు చేశారని, ఇందులో ఇద్దరు గ్రామస్తులున్నారని, ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించెందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని, ఈ అరెస్టులను ఖండిస్తున్నమని, అరెస్టు అయిన వారిని వెంటనే కోర్టుల హాజరు ఏర్చాలని కోరుతున్నామని, ఇటువంటి చర్యలను అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు ఖండించాలని, తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు వీలుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలోని ఆర్ ఎస్ ఎస్-బీజేపీ ఫాసిస్టు పార్టీ కేవలం కొద్దిమంది కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మరియు దేశంలో మనువాది కుల వ్యవస్థతో కూడిన సామాజిక నిర్మించేందుకు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగిస్తోందని, దానిలో భాగంగానే మావోయిస్టు ముక్తే(దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను, భావజాలంను లేకుండా చేయడం), ప్రతిపక్ష ముక్త్ లక్ష్యంతో కగార్ యుద్ధాన్ని అమలు చేస్తుందని, ఆరెస్సెస్-బీజేపీలు దేశంలో మనువాది కుల వ్యవస్థతో కూడిన సామాజిక వ్యవస్థను నిర్మించేందుకు రూపొందించుకున్న విధానాలను కొనసాగించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని,
ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, ఏక్ చునావ్, ఏక్ పార్టీ నినాదాలతో దేశంలోని అన్ని పార్టీలను నిర్వీర్యం, నిర్మూలన చేసే పథకంతో ముందుకు పోతున్నదని. ఎలక్షన్ కమీషన్, కోర్టులు, సీబీఐ, ఎస్ఐఏ మరియు ఇతర రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను తన కంట్రోల్ లో పెట్టుకొని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాతర వేసిందని, దానికి బీహార్ ఎన్నికలే తాజా ఉదాహరణ అని, కాబట్టి నేడు ఆర్ ఎస్ ఎస్-బీజేపీలు దేశంలో అత్యంత ప్రమాదకరమైన శక్తులుగా నిరూపితమైయ్యాయని, వారు కొనసాగిస్తున్న ఆర్ధిక పాలసీలు కార్పొరేట్ల ప్రయోజనాలకు మాత్రమేనని, వారు తెస్తున్న పాలసీలు, చట్టాలు దేశంలోని ప్రజలకు, పార్టీలకు, సంఘాలకు అన్ని వర్గాలకు ప్రమాదకరమేనని, కాబట్టి అందరూ ఏకమై ఆర్ ఎస్ ఎస్-బీజేపీ లకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామని జగన్ అ ప్రకటనలో కోరారు.