17-12-2025 05:33:05 PM
నిర్ణీత గడువులోగా మున్నూరు కాపు భవనాన్ని పూర్తి చేయాలి..
భవన నిర్మాణ కమిటీ కన్వీనర్ గా ఇ.వి.శ్రీనివాస్ రావు నియామకం..
హనుమకొండ (విజయక్రాంతి): జిల్లా మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, గత పదేళ్లుగా కేవలం శంకుస్థాపనలకే పరిమితమైన ఈ భవన నిర్మాణాన్ని తమ ప్రభుత్వ హయాంలో కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మొదట రూ.5 కోట్లుగా ఉన్న భవన నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.7 కోట్లకు రీ–ఎస్టిమేట్ చేయించి, నిధులు మంజూరు చేయడంతో పాటు నిర్మాణ పనులను వేగవంతం చేశామని పేర్కొన్నారు. ఈ భవనం జిల్లా మున్నూరు కాపు సోదరులకు ఒక కీలక మైలురాయిగా నిలవడమే కాకుండా, భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు కుల బాంధవులు మాట్లాడుతూ, జిల్లాల్లో మున్నూరు కాపుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ గతంలో తమ కమ్యూనిటీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని తెలిపారు. అలాంటి పరిస్థితిని మార్చి, భవన నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కమిటీ కన్వీనర్‌గా ఇ.వి. శ్రీనివాస్ రావు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం ఇ.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, భవన నిర్మాణ కన్వీనర్‌గా తనను నియమించినందుకు కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవన నిర్మాణాన్ని నాణ్యతతో, పారదర్శకంగా, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంద ఐలయ్య, కటకం పెంటయ్య, గైనేని రాజన్, కోరబోయిన సాంబయ్య, తోట వెంకన్న, దేవర కొండ విజయలక్ష్మి సురేందర్, వేల్పుల మోహన్ రావు, పుప్పాల ప్రభాకర్, ఏనుగుల రాంప్రసాద్, కొత్త దశరథం, సాయిని రవీందర్, పాటి శ్రీనివాస్, మందాటి మహేందర్, కనుకుంట్ల రవి కుమార్, కందుల సృజన్, పెరికారి శ్రీధర్, పెంచాల గోపాల్, బక్కి రాజ్కుమార్, మాడిశెట్టి రాజకుమార్, సతీష్, పుప్పాల రజిని కాంత్, కొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.