24-09-2025 07:10:05 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా అడవుల్లో ఈ నెల 11 న జరిగిన ఎన్ కౌంటర్ లో అసువులు బాసిన ఏఓబి మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు జాడి వెంకటి అలియాస్ మంగన్న అలియాస్ విమల్ సంతాప సభను బుధవారం అతని స్వగ్రామం బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో అమరుల బంధుమిత్రుల కమిటీ, పౌర హక్కుల నేతలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాడి వెంకటి చిత్రపటానికి అతని కుటుంబ సభ్యులు పూలమాలవేసి నివాళులర్పించారు. అమరుల బంధుమిత్రుల కమిటీ ఆధ్వర్యంలో రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
సికాస నిర్మాతల్లో ఒకరైన హుస్సేన్, విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీనాక పాణి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నక్క నారాయణరావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొంకూరి లక్ష్మణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు నారా వినోద్, అమరుల బంధుమిత్ర కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ కుమారి, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలు శాంతక్క, కార్మిక అనుబంధ సంఘాల నాయకులు మావోయిస్టు ఉద్యమంలో జాడి వెంకటి అలియాస్ విమల్ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
పీడిత ప్రజల హక్కుల కోసం వెంకటి విప్లవోద్యమ బాటను ఎంచుకున్నారని, చంద్రవెల్లి గ్రామం నుండి ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా విప్లవోద్యమ పంథా లో ఎదిగి వచ్చి సాయుధ పోరు మార్గానికి తన రక్తతర్పణంతో దారులు వేశాడని వారు కొనియాడారు. సంతాప సభలో మాజీ సర్పంచ్ కొమ్మెర లక్ష్మణ్, న్యూ డెమోక్రసీ నాయకులు చాంద్ పాషా తోపాటు పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.