calender_icon.png 25 May, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ది నిప్పుతో చెలగాటం

06-05-2024 01:08:27 AM

హిందూ ముస్లింలను ఆ పార్టీ విడదీస్తున్నది

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విమర్శలు

న్యూఢిల్లీ, మే 5: ఓట్లకోసం కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లింల మధ్య విబేధాలు సృష్టించి నిప్పుతో చెలగాటమాడుతున్నదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘సమాజంలోని ప్రశాంతతను చెడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ముస్లింలను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగానే చూస్తున్నది. రాజకీయాలంటే ప్రభుత్వాలను ఏర్పాటుచేయటమే కాదన్న విషయం గుర్తుంచుకోవాలని వారికి నేను చెప్పదలిచాను. రాజకీయాల లక్ష్యం జాతి నిర్మాణం కావాలి’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీలో ఫైర్ లేదు.. కానీ ఆ పార్టీ ఫైర్‌తో ఆడుకొంటున్నది అని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్‌కు ఇప్పుడు మాట్లాడటానికి అంశాలేమీ లేవు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం ఒక్కటే వాళ్ల లక్ష్యం. అందుకోసం సమాజాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొడుతున్నది. సమాజంలో ఒకరకమైన భయోత్పాతం సృష్టించాలని చూస్తున్నది’ అని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను అమలుచేస్తుందని అన్నారు. ‘వారసత్వ పన్నును అమలుచేసిన అర్జెంటీనా, వెనుజులా ఆ తర్వాత దారుణమైన పరిణామాలు ఎదుర్కొన్నాయి. ఆ పన్నును అమలుచేస్తే పెట్టుబడిదారులు భారత్‌పై నమ్మకం కోల్పోతారు’ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 స్థానాలు గెలుస్తుందని, ఎన్జీయే 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.