14-07-2025 12:45:08 AM
మాజీ ఎంపీ కవిత ఆరోపణ
మహబూబాబాద్, జూలై 13 (విజయ క్రాంతి): రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడమొక్కటే బీసీ రిజర్వేషన్లకు పరిష్కారమని, అది కాకుండా ఆర్డినెన్స్ ద్వారా 42శాతం బీసీ రిజర్వేషన్లు అంటే ముమ్మాటికీ రాజకీయ డ్రామాయేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నాటకం ఆడుతోందని మహబూబాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆరోపించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీసీలను మోసం చేసింది ఇక చాలని హెచ్చరించారు. వాస్తవాలు పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసం కాంగ్రెస్ ‘కామారెడ్డి డిక్లరేషన్ పేరిట’ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని మోసపూరిత హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
బీసీ సమాజం నుంచి పలు రూపాల్లో వచ్చిన తీవ్రఉద్యమ నేపథ్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్, కుల గణన, ఆ తదుపరి 42 రిజర్వేషన్లు బిల్లు అసెంబ్లీ, శాసన మండలిలో పెట్టడం జరిగిందని, బీఆర్‌ఎస్ పార్టీ బిల్లుకు సంపూర్ణంగా మద్దతు నిచ్చిందన్నారు. శాసనసభలు ఆమోదించిన 42 రిజర్వేషన్లు చట్టాన్ని రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి గవర్నర్ పంపారన్నారు.
ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్షం ప్రధాన మంత్రి వద్దకు తీసుకెళ్లాలని, దాని ద్వార కేంద్రం పై రాజకీయ ఒత్తిడి పెంచాలని బీఆర్‌ఎస్ పార్టీ కోరుతున్నదన్నారు. నాలుగు నెలలవుతున్నప్పటికీ ఆ ప్రయత్నమే చేయకపోగా మరోసారి అదేవిషయంలో ఆర్డినెన్స్ ఇవ్వాలనుకోవడం బీసీ సమాజాన్ని మోసం చేయడమేనని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, జడ్పీ మాజీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మర్నేని వెంకన్న, బీరవెళ్లి భరత్ కుమార్ రెడ్డి, యాళ్ళ మురళీధర్ రెడ్డి, తేళ్ల శ్రీనివాస్, ఊకంటి యాకుబ్ రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్ జడ్పీ మాజీ కో ఆప్షన్ మహబూబ్ పాషా, మర్నేని రఘు, బోడ లక్ష్మణ్, మర్నేని కిరణ్ కుమార్, నరసింహ నాయక్, అసిఫ్ అలీ, పొన్నాల యుగేందర్ పాల్గొన్నారు.