10-10-2025 11:44:01 PM
ఏర్గట్ల,(విజయక్రాంతి): మండల కేంద్రం ఏర్గట్ల లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ అందం ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ..బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కపట రాజకీయాలు చేస్తూ – న్యాయస్థానాల పై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందోని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బిసి రిజర్వేషన్‌ల అంశంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ చిత్తశుద్ధి లేని కపట ప్రేమను బయటపెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిసి రిజర్వేషన్‌ల పెంపు అంశంలో కాంగ్రెస్ తెలివిగా డ్రామా లాడుతోందని “మేము పెంచాలనుకున్నాం, కానీ కోర్టు అడ్డుపడింది” అని న్యాయస్థానంపై నెపం వేస్తూ బిసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఈ ప్రతి ఒక్క బీసీ బిడ్డ గమనించాలని గుర్తుకు చేశారు.చెల్లదని తెలిసినా, బిసి లను మభ్యపెట్టే ఉద్దేశంతో రిజర్వేషన్ పెంపు జీ.ఓ జారీ చేసి యావత్తు బీసీ లను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆయన అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించినంతరం మళ్లీ పార్టీ అనుచరులతోనే కోర్టులో కేసు వేయించి ఆ నిర్ణయాన్ని అడ్డుకోవాలనే కుట్ర చేసింది కాంగ్రెస్సేనని,ఈ ద్వంద్వ నాటకం ఎవరి కోసం? ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి ఈ డ్రామాలు ఆడుతున్నావ్ రేవంత్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలంటే సంబంధిత షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగ సవరణ తప్పనిసరి చేయాలన్న వాస్తవం తెలిసి కుడా కామారెడ్డి బిసి డిక్లరేషన్ పేరుతో 42 శాతం అంటూ ఎన్నికల సమయంలో బిసి ఓట్ల కోసం మోసం చేసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.నేడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం అదే పాత బిసి రిజర్వేషన్ డ్రామా మళ్లీ ప్రారంభించిందని,రాజ్యాంగ సవరణ కోసం 22 నెలలుగా ఢిల్లీలో పోరాటం చేయకుండా కాంగ్రెస్, గల్లీలో మాత్రం డ్రామాలు ఆడుతుందని ఎద్దేవా చేశారు. బిసి రిజర్వేషన్ లపై ఉభయ చట్ట సభల్లో తీర్మానం చేసి గవర్నర్‌కి పంపినప్పుడు గవర్నర్ తొక్కిపెట్టడం, బీజేపీ పార్టీకి బీసీల పట్ల వున్న కపట ప్రేమ బీసీ లు గమనిస్తున్నారని అసెంబ్లీ లో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి కుడా ఆమోదం తెలుపక కపోవడం కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి బిసి లపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అయన అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా చెబుతున్నాం — బిసి రిజర్వేషన్‌ల పెంపు కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నిజాయితీగా పోరాటం చేస్తే, మేము కూడా వారితో కలిసి వస్తాము. కానీ ప్రజలను మోసం చేసే కపట రాజకీయాలను సహించేది లేదని అన్నారు. ఇకనైన రేవంత్ రెడ్డి బిసి లను రాజకీయ లబ్ది కోసం వాడుకోకుండా రిజర్వేషన్ ల పెంపు పై చిత్త శుద్ధి తో పని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు అయన అన్నారు.