04-11-2025 12:30:13 AM
							-ఎర్రగడ్డ, రెహమత్‌నగర్ డివిజన్లలో మంత్రులు జూపల్లి, పొంగులేటి పాదయాత్ర
-తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి, తమ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేర్వేరు ప్రాంతాల్లో పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టి, బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జూబ్లీహిల్స్ నియో జకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బస్తీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ‘ఆరు గ్యారెంటీలు’, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సుల్తాన్ నగర్‌లోని కల్పతరు రెసిడెన్సీలో నివాసితులతో సమావేశమై, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.
అనంతరం ఎర్రగడ్డ డివిజన్‌లోని రాజీవ్‌నగర్, జయంతి నగర్, కళ్యాణ్‌నగర్‌లో పాదయాత్ర చేశారు. ఆయన వెంట డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మరోవైపు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెహమత్‌నగర్ డివిజన్‌లో ప్రచారం చేశారు. ఆయన సమక్షంలో కార్మికనగర్‌లో 200 మంది యువకులు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆటో డ్రైవర్లు భారీ ఆటోర్యాలీ నిర్వహించారు.