calender_icon.png 4 November, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల రక్షణపై పాలకులు దృష్టి సారించాలి

04-11-2025 07:33:39 PM

కేంద్ర ప్రభుత్వ విధానాలే మహిళలకు నష్టం

గరిడేపల్లి,(విజయక్రాంతి): మహిళల భద్రతపై పాలకలు దృష్టి సారించి మరిన్ని ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని సూర్యాపేట జిల్లా ఐద్వా అధ్యక్షరాలు తంగెళ్ల వెంకట చంద్ర డిమాండ్ చేశారు.గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆలిండియా 14వ మహాసభలపై మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆల్ ఇండియా 14వ మహాసభలు వచ్చేఏడాది జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాదులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మహిళలకు సమాన హక్కులపై, ఆస్తి హక్కుపై చట్టం తీసుకురావడంలో పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల కోసం ఐద్వా పోరాటాలు చేసి సాధించుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మహిళలపై హింస, అభద్రతాభావం పెరిగిందన్నారు. స్త్రీ పురుష నిష్పత్తిలో తగ్గుతున్న మహిళ సంఖ్య, నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలే సమాజంలో మహిళలకు నష్టం జరిగే పరిస్థితి నెలకొన్నాయన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చాక మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందన్నారు. మేదో వికాసాన్ని, ప్రజాస్వామ్యాన్ని మనువాదం సహించలేకపోతుందని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లపై ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు నెలకు 2500 అందిస్తామని ప్రకటించి నేటికీ అమలుకు నోచుకోలేదని తెలిపారు. దీంతోపాటు పింఛన్ పథకాన్ని అమలు చేయడం లేదని,మహిళ ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ కూడా జమ కావడం లేదని ఆమె తెలిపారు.ఈ మహాసభల సందర్భంగా ఆడపిల్లల భ్రూణ హత్యలు,పెరుగుతున్న హింస, అణిచివేతకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలను బాలికలను చైతన్యవంతం చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో సెమినార్లు, సరస్సులు, కళాజాత ప్రదర్శనను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్లు ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా మహిళా ఉద్యమాలను బలోపేతం చేయాలని, మహిళల హక్కులే మానవ హక్కులుగా రానున్న కాలంలో సంఘటిత పోరాటాలే మార్గమని తెలిపారు.కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మద్దెల జ్యోతికార్యదర్శి వర్గ సభ్యురాలు సుందరి రమాదేవి,యానాల సుశీల,మహిళా నాయకురాలు భూతం సరిత,ఆవుల సరోజన, ఆవుల సైదమ్మ,పెండెం నాగజ్యోతి, ఆవుల నాగమణి, పెండెం నవ్య, అనిత తదితరులు పాల్గొన్నారు.