09-10-2025 07:24:20 PM
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్..
తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు గడిచిన నేటి వరకు స్థానిక సంస్థలను పెట్టలేని అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వందేనని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం మండలం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుపై కార్యకర్తలతో అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేర్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. రైతులు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గ్రామాలకు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకపోవడంతో గ్రామాల్లో నేడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా తయారైందని దుయ్యబట్టారు. రైతులకు ఒక్క బస్తా యూరియా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. గ్రామాల్లో ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జా యుగంధర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, గుండ గాని రాములు గౌడ్, గుండ గాని దుర్గయ్య దొంగరి శ్రీను, కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, గోపగాని రమేష్ గౌడ్, గోపగాని శ్రీను, తునికి సాయిలు గౌడ్ తునికి లక్ష్మమ్మ తడకమల్ల రవికుమార్ శ్రీకాంత్, సాయి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.