09-10-2025 10:48:13 PM
న్యాయం కావాలని కోరుతున్న ప్లాట్ల యాజమాన్యాలు..
పటాన్ చెరు: పటాన్ చెరు మండలంలోని రామేశ్వర బండ గ్రామంలో వెంచర్ వివాదం తీవ్రతరం అవుతోంది. 1987లో సర్వే నంబర్లు 183, 184, 221లలో కలిపి మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ చేయగా, అనంతరం 2005లో అదే ప్రాంతంలో రెండో వెంచర్ కూడా నమోదు చేయడం వివాదానికి దారితీసింది. సర్వే నంబర్ 221లో 14 ఎకరాలు 10 గుంటల భూమికి వెంచర్ చేసినప్పటికీ, వాస్తవానికి కేవలం 12 ఎకరాలకు మాత్రమే మ్యూటేషన్ జరగడంతో మొదటి వెంచర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి సూర్య ఎన్క్లేవ్ వెంచర్ యజమానులు ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించగా, కోర్టు 2025 సెప్టెంబర్ 18న స్టే ఆర్డర్ జారీ చేసినట్లు సమాచారం.
అయినా కూడా పంచాయతీ, మండల అధికారులు ఆ భూమిపై తమకే అధికారం ఉందంటూ ఆదేశాలు జారీ చేయడం బాధితులను ఆవేదనకు గురిచేస్తోంది. తమ స్థలంలో కంటైనర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే రెండో లేఔట్ ప్రతినిధులు అడ్డుకోవడానికి ప్రయత్నించారని, దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణం అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని మొదటి వెంచర్ యజమానులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.