23-08-2025 06:25:10 PM
ఎస్జిఎఫ్ క్రీడలను ప్రారంభించిన తహసిల్దార్ దయానందం, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు
తుంగతుర్తి (విజయక్రాంతి): రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు(Single Window Chairman Gudipati Saidulu) అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రంలో రాష్ట్ర, జాతీయ క్రీడా పోటీలను నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నాడని తెలిపారు. శనివారం మండల పరిధిలోని వెలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను గుడిపాటి సైదులు అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సైదులు ప్రసంగిస్తూ... క్షేత్రస్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా స్కూల్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, క్రీడల వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. మండల స్థాయి ఎస్‌జీఎఫ్ పోటీలలో పాల్గొంటున్న విద్యార్థులు భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కాగా, ఒక్క రోజు జరిగే క్రీడలలో మండలానికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. బాల బాలికలకు వాలీబాల్ పోటీలు జరగనున్నట్లు క్రీడల ఎస్ జిఎ ఫ్ మండల కన్వీనర్ కొండగడుపుల యాకయ్య తెలిపారు. ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ క్రీడల ప్రోత్సాహానికి, విద్యార్థులకు ఉపయోగపడేలా రూ.10000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పోటీల ప్రారంభ కార్యక్రమంలో తహసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్, ఎంఈఓ బోయినీ లింగయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గ్రామంలోని గ్రామ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్.నరేష్, ఎం ఎన్ వో వెంకట్ రెడ్డి, క్రీడల నియోజకవర్గ కన్వీనర్ యాకయ్య, ప్రధానోపాధ్యాయురాలు ఉషా రాణి, తుంగతుర్తి ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్, మండలం లోనీ వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.