calender_icon.png 25 November, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ చీరలు కాదు… ఇచ్చిన హామీల సంగతేమయ్యాయి?

25-11-2025 08:07:19 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమ పథకాలను రద్దు చేసి ఇప్పుడు మాత్రమే బతుకమ్మ చీరలు పంచడం ఓట్ల రాజకీయమేనని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం బీఆర్ఎస్ మండల కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఎన్నికల సమయంలో మహిళలకు అనేక వాగ్దానాలు చేసి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కీలక సంక్షేమ పథకాలను నిలిపివేసినట్లు ఆరోపించారు.

గతంలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రతి ఇంటి మహిళకు బతుకమ్మ చీరలను అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం పండుగ రోజుకి కనీసం లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేనంత దారుణ స్థితికి చేరుకుందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వస్తే రెండు చీరలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు సంవత్సరాలు పూర్తయినా ఒక్క చీర కూడా ఇవ్వకుండా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చీరలు పంచడం ప్రజలను మోసగించే ప్రయత్నమని అన్నారు.

గతంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు ఇవ్వగా, ఇప్పుడు స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే పంచడం కూడా అన్యాయమని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలో నెలకు రూ.2,500 జమ చేస్తామని చేసిన హామీ ఇంకా అమలుకాలేదని, 24 నెలలు పూర్తయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.60,000 బాకీగా ఉందని అమరేందర్ యాదవ్ అన్నారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఆ డబ్బులు జమ చేసి ఓట్లు అడగాలని ఆయన వ్యంగ్యంగా సూచించారు.

కేవలం బతుకమ్మ చీరలే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, పుట్టిన పిల్లలకు ఇచ్చే నగదు ప్రయోజనాలు వంటి అన్ని పథకాలను కాంగ్రెస్ రద్దు చేసిందని ఆరోపించారు. వితంతు మహిళలకు హామీ ఇచ్చిన రూ.4,000 పెన్షన్ ఇవ్వకపోగా, ప్రస్తుతం ఇస్తున్న రూ.2,000 కూడా సమయానికి అందడం లేదన్నారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు. మహిళల సంక్షేమాన్ని కుదేలు చేసి ఇప్పుడు ఎన్నికల లాభం కోసం కొత్త నాటకాలు వేస్తున్న ప్రభుత్వం చేసిన ప్రతి చర్యను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని కోడి అమరేందర్ యాదవ్ హెచ్చరించారు.