25-11-2025 08:33:12 PM
మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్, ప్రముఖ సైక్లిస్ట్ చందన జయరాం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సైక్లింగ్ తో మహిళలకు ఫిట్ నెస్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వరకు 600 కి.మీ. సైక్లింగ్ యాత్రను ప్రారంభిస్తోంది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌లలో ఒకటైన మధురి గోల్డ్ ఈ కార్యక్రమానికి మద్ధతుగా నిలిచింది. తాజాగా ఈ రైడ్ కు సంబంధించిన జెర్సీని చందన జయరాం, మాధురి గోల్డ్ సీఈవో సునీల్, సీఎంవో, జాతీయ ఆఫ్ రోడ్ బైకింగ్ ఛాంపియన్ విశ్వాస్ కలిసి ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే తాను ఎప్పుడూ ఫిట్ నెస్ ప్రేమికురాలినని, ఆరోగ్యం కోసం 10 నెలల్లో 20 కిలోల బరువు తగ్గినట్టు చందనా జయరాం చెప్పింది.
మరికొందరు సైక్లింగ్ టీమ్ తో కలిసి శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వరకూ కఠినమైన రూట్లలో సైక్లింగ్ రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకున్నట్టు తెలిపింది. కాగా గత ఏడాది మిస్ యూనివర్స్ ఏపీ పోటీల్లో విజేతగా నిలిచిన చందన జయరాం సైక్లిస్ట్ గానూ రాణిస్తోంది. అత్యంత కఠినమైన గ్లోబల్ ఎండ్యూరెన్స్ సైక్లింగ్ ఛాలెంజ్ ను ఆమె విజయవంతంగా పూర్తి చేసింది. తన సాహసోపేతమైన రైడ్ తో కొందరు మహిళలైనా సైక్లింగ్ ద్వారా ఫిట్ నెస్ పై ఫోకస్ చేయాలని ఆకాంక్షించారు. మరోవైపు మహిళలకు ఫిట్ నెస్ పై అవగాహన కల్పించే మంచి ఉద్దేశంతో చందన జయరాం చేపట్టిన ఇలాంటి కార్యక్రమానికి మద్ధతుగా నిలవడం తమకు సంతోషంగా ఉందని మాధురి గోల్డ్ సీఈవో సునీల్ చెప్పారు.