25-11-2025 08:37:17 PM
హన్మకొండ (విజయక్రాంతి): సహృదయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 2026 జనవరి 1 నుండి 4వ తేదీ వరకు సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించబడతాయని సంస్థ కన్వీనర్ డి.ఎస్.ఎన్ మూర్తి, అప్పా జోశ్యుల సత్యనారాయణలు అన్నారు. మంగళవారం హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అజో విభూ కందాలం ఫౌండేషన్(అమెరికా), సహృదయ సాంస్కృతిక సంస్థ వరంగల్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ ఉత్సవాలు, హన్మకొండలోని కాళోజి కళాక్షేత్రంలో నిర్వహించ బడతాయని, ఇవి మాత్రమే కాకుండా మూడు రోజులు ప్రత్యేకంగా ఉభయ రాష్ట్రాల నుండి ఎంపిక చేసిన తెలుగు కథా నాటకాలు, ప్రదర్శనలు ఉంటాయని, ప్రతిరోజు మూడు నాటకాలు, మొత్తం తొమ్మిది నాటకలు ఉంటాయని, రంగస్థల సేవ చేసిన ఒక వ్యక్తికి పదివేల రూపాయల రంగస్థలం పురస్కారం ఉంటుందన్నారు.
ముగ్గురికి సాహిత్య పురస్కారం అందిస్తున్నామని, డాక్టర్ జి.వి. రత్నం, వరంగల్, 2026 సంవత్సరం- ప్రతిభా మూర్తి జీవితకాల సాధన పురస్కారం క్రింద ఒక లక్ష రూపాయలు సన్మానం ఉంటుందన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని, తిలకించి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి. గిరిజ మనోహరబాబు, వనం లక్ష్మీ కాంతారావు, ఏ.వి. నరసింహారావు, కె కృష్ణమూర్తి, న్యాలకొండ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.