25-11-2025 08:09:31 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా దర్గా కాజీపేట జాగీరు ప్రభుత్వ ప్రాథమిక ఇంగ్లీష్ మీడియం పాఠశాలలతో పాటు అయోధ్యపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. నాలుగో తరగతిలో ఉపాధ్యాయురాలు ఆంగ్లంలో పాఠ్యాంశం చెబుతుండగా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో పాఠ్యాంశాన్ని చదివించారు.
తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. వంట గదిలోని సరుకులను పరిశీలించి, విద్యార్థులకు వండిన భోజన పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడే విధంగా, రాసే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి విద్యార్థిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆంగ్ల భాషలో మెరుగ్గా ఉండేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ మన్మోహన్, ఎంఈవో మనోజ్ కుమార్, తహసీల్దార్ భావ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.