calender_icon.png 17 October, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద నీటి నివారణకు చర్యలు తీసుకోండి

16-10-2025 11:20:43 PM

వరద నీటి నివారణకు చర్యలు తీసుకోండి..

నిర్మల్ (విజయక్రాంతి): పట్టణంలో వర్షాకాలం వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి వర్షాకాలం పట్టణంలో వరద నీరు నిల్వ ఉండకుండా చేపట్టవలసిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో భవిష్యత్తులో వరద నీరు నిల్వ ఉండకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వర్షాకాలానికి మునుపే నాళాల్లో పేరుకుపోయిన చెత్తా, చెదారం, తొలిగించినట్లు తెలిపారు. అవసరమైన చోట డ్రైనేజీల మరమ్మత్తులు చేపడతామని అన్నారు.

వరద నీటి నియంత్రణకు అవసరమైతే నూతన నిర్మాణాలు చేపడతామని అన్నారు. పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించామని, ఆయా ప్రాంతాలలో ఇకముందు వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసి, వరదనీరు చేరి, నిల్వ ఉండటం వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు రోడ్లపై నిల్వనుండకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగ్గా నిర్వహించాలని తెలిపారు. వరద నీటి నిల్వ నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇరిగేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.