02-09-2025 12:12:37 AM
యూరియా కోసం పడి గాపులు కాయడం ఏంటి
మహబూబ్ నగర్ సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): యూరియా వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ దగ్గర రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రైతులు చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి, మాజీ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత ఉందని అధికారులకు చెపుదామని బయలుదేరాం..
అంతలోనే పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వద్దకు ర్యాలీగా వచ్చి నిరసన తెలుపుతున్నారని సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చామన్నారు. రైతులు పొలాలు..ఇండ్ల వద్ద పనులు వదులుకొని యూరియా పంపిణి కేంద్రాల వద్ద పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పది పదిహేను రోజుల క్రితం టోకెన్ లు ఇచ్చి కుడా రైతులకు యూరియా ఇవ్వడం లేదన్నారు.
ఆంధ్రాలో అక్కడ ఉన్న కేంద్ర మంత్రులతో మాట్లాడి వీరిగా తెప్పిస్తుంటే ఇక్కడ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇప్పటికైనా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఎవరు ఏం పోస్టులు పెడుతున్నారు చూస్తున్న ప్రభుత్వానికి రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చూడడం లేదా అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా రైతుల ఆవేదనను పరిగణలోకి తీసుకొని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులు సమస్యలపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కి వినయ్ పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.