04-09-2025 07:47:50 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): గత ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరంలో వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలకు కేంద్ర విపత్తు నిర్వహణ ద్వారా మంజూరు అయిన 3.00 కోట్ల నిధులను ఖర్చు చేసి యు.సిలు సిద్ధం చేసి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. గత వర్షం వరదల వల్ల ఎక్కడెక్కడ నష్టం వాటిల్లిందొ వాటికి మరమ్మతుల కొరకు ఖర్చు చేసిన బిల్లులు సిద్ధం చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ, రోడ్డు - భవనాలు, సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, నీటిపారుదల, మున్సిపాలిటీ శాఖలకు సంబంధించిన నష్టాలు, చేపట్టిన మరమ్మతు పనులను కలెక్టర్ సమీక్షించారు.
ఎడతెరపి లేని వర్షాల వల్ల డ్యామేజ్ అయిన అంగన్వాడి భవనాలు, రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మహిళా సంఘ భవనాలు, మిషన్ భగీరథ ట్యాంకులు తదితర మరమ్మతుల కోసం కేంద్ర విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా రూ. 3 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని, వాటిని సకాలంలో సద్వినియోగం చేసుకొని యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి, ఎన్ని పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరి వరకు పనులను సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో నివేదిక ఇవ్వాలని వాటికి సంబంధించిన మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ అధికారి మహమ్మద్ గని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, మున్సిపాలిటీ కమిషనర్లు, ఆర్ అండ్ బి అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, డి.సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.