calender_icon.png 18 November, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఆశల పద్దు

23-07-2024 03:55:00 AM

  1. ఎన్నో సవాళ్ల నడుమ ఫుల్ బడ్జెట్‌పై కసరత్తు
  2. ఖర్చులు పెరిగినా బడ్జెట్ పెంచకుండా చర్యలు
  3. కేంద్ర సాయం కోరుతూనే..
  4. బీజేపీకి క్రెడిట్ ఇవ్వకుండా కేటాయింపులు
  5. రూ.2.80లక్షల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ఫుల్ బడ్జెట్‌ను అసెంబ్లీలో సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న సర్కారు.. ఈ పద్దును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఫిబ్రవరిలో రూ.2.75లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ ప్రభుత్వం జూలై 25న దాదాపు రూ.2.80లక్షల కోట్లతో ఫుల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. పదేళ్ల ప్రత్యేక రాష్ట్రంలో 12 సార్లు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెండు ఓటాన్ అకౌంట్, పది పూర్తిస్థాయి పద్దులు ఉన్నాయి. అనేక ఆర్థిక సవాళ్ల మధ్య రాబోతున్న బడ్జెట్‌కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

పదేళ్ల ప్రణాళికకు గీటురాయిగా?

వచ్చే పదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ క్రమంలో పదేళ్ల ప్రయాణానికి ఈ బడ్జెట్‌ను గీటురాయిగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే స్వయంగా రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. బడ్జెట్ రూకల్పనపై ప్రత్యేక ఫొకస్ పెట్టారు. వాస్తవాలకు, అంచనాలకు మధ్య తేడా లేకుండా చాలా జాగ్రత్తగా కేటాయింపులపై దృష్టిసారించినట్లు సమాచారం.

బడ్జెట్ పెంచలే 

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు భారీగా నిధులు అవసరమవుతాయి. సంక్షేమ పథకాల సంఖ్య బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కంటే కాంగ్రెస్ హయాంలో పెరిగాయి. తద్వారా ఖర్చు కూడా ఎక్కువగా అవుతోంది. కానీ ఆశ్చర్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2023 బడ్జెట్ కంటే.. 2024 ఓటాన్ అకౌంట్ పద్దులో దాదాపు రూ.15కోట్లు తగ్గించింది. బడ్జెట్ వాస్తవికతకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతోనే గతేడాది బీఆర్‌ఎస్ సర్కారు రూ.2.90లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రకటించగా 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూ.2.75లక్షల కోట్లకు తగ్గించారు.

వాస్తవావికి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, మూసీ సుందరీకరణ లాంటి అభివృద్ధి పనులకు భారీగా నిధులు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బడ్జెట్‌ను పెంచాల్సి పోయి అనూహ్యంగా బడ్జెట్‌ను తగ్గించడం ఆశ్చర్యకరం. గత బడ్జెట్‌లో అంచనాలు, వాస్తవాలనకు చాలా వ్యత్యాసం ఉందని కాగ్ నివేదిక చెబుతోంది. ఈ క్రమంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాస్తవానికి దగ్గరగా రూపొందించడం వల్లే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు తగ్గాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్‌లో అంచనాలను అందుకునేలా పూర్తిస్థాయిలో కసరత్తు చేసి మరో రూ.5,000కోట్ల నుంచి రూ.10,000 పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.2.80లక్షల కోట్లకు అటుఇటుగా బడ్జెట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

సవాళ్లను ఎదురీదేనా?

అనేక సవాళ్ల నడుమ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఏడాదికి సంబంధించిన ఫుల్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది. గతేడాది కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లు 23శాతమే వచ్చాయి. రాష్ట్రాని కి ప్రధాన ఆదాయ వనరుగా భావించే ట్యాక్స్ రెవె న్యూ లక్ష్యాన్ని కూ డా పూర్తిస్థాయిలో సాధించలేదు. నిర్దేశించిన లక్ష్యంలో 88 శాతం మాత్రమే సాధిచండం గమనార్హం. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల వల్ల రెవెన్యూ రాబడిని పెంచుకునేందుకు అవకాశం లేకుండా పోయిం ది. దీంతో బడ్జెటేతర అప్పులు తీసుకోవడం రేవంత్‌రెడ్డి సర్కారుకు పెద్ద సవాలే అని చెప్పా లి.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల వల్ల గత బీఆర్‌ఎస్ సర్కారు ఆఫ్ బడ్జెట్  రుణాలను భారీ గా తగ్గించాల్సి వచ్చింది. దీని వల్ల రెవెన్యూ రాబడిలో భారీ లోటు ఏర్పడి వ్యయం కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఫలితంగా వచ్చిన రాబడిలో 53 శాతం జీతాలు, అప్పులు, పెన్షన్లకే పోయినట్లు కాగ్ నివేదిక చెబుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కు ఈ బడ్జెట్‌లో రేవంత్‌రెడ్డి కేంద్రం నుంచి సాయాన్ని కోరుతున్నారు. పలు అంశాలపై ఇప్పటికే పలుమార్లు వినతులను అందజేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో  రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 8 సీట్లతో విజయం సాధించి సమానంగా నిలిచాయి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి సాయం వస్తే ఆ క్రెడిట్ బీజేపీకి దక్కే అవకాశం లేకపోలేదు. 

తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్

తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. అందుకే అటు ప్రభుత్వం, ఇటు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో 2014లో కాంగ్రెస్ చివరి సారిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణలో 13వ బడ్జెట్‌ను సొంత రాష్టంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించేందుకు సిద్ధమవుతోంది.

గత పదేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలు

   ఏడాది బడ్జెట్

2014-15 రూ.1,00,637.96 కోట్లు

2015-16 రూ.1,15,689.19 కోట్లు

2016-17 రూ.1,30, 415.87 కోట్లు

2017-18 రూ.1,49, 446 కోట్లు

2018-19 రూ.1,74,453 కోట్లు

2019-20 రూ.1,82,016.84 కోట్లు (ఓటాన్)

2019-20 రూ.1,46,492.30 కోట్లు

2020-21 రూ.1,82,914.42 కోట్లు

2021-22 రూ.2,30,825.96 కోట్లు

2022-23 రూ.2,56,958.51 కోట్లు

2023-24 రూ.2,90,396 కోట్లు

2024-25 రూ.2,75,981 కోట్లు(ఓటాన్)

2024-25 రూ.2.80లక్షల కోట్లు ( అంచనా)