23-07-2024 03:55:00 AM
సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వండి:హైకోర్టు
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతుల కల్పనపై వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ భర్తీకి తీసుకున్న చర్యలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది. సర్కార్ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించకపోవడాన్ని, సిబ్బందిని నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ హెల్ప్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కే అఖిల్ శ్రీగురుతేజ వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
పిటిసనర్ తరఫున అడ్వొకేట్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు, భారత వైద్య ప్రమాణాలు ప్రకారం ప్రభుత్వ జిల్లా దవాఖానలతోపాటు ఏరియా దవాఖానలు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ సెంటర్లు, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న జనరల్ దవాఖానల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, పారామెడికల్ సిబ్బందిని నియమించాల్సి ఉందని తెలిపారు. 4,343 డాక్టర్ పోస్టులు మంజూరుకాగా 67 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 8 జిల్లా దవాఖానలు మాత్రమే ఉన్నాయని, 25 జిల్లాల్లో జిల్లా దవాఖానలు లేవని గుర్తుచేశారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యవిధాన పరిషత్ కమిషనర్, డీఎంఈ, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్, తెలంగాణ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రా డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసలు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.