16-07-2025 12:00:00 AM
మెదక్, జూలై 15 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సమావేశానికి వెళ్లి, తిరిగి స్వగ్రామానికి కారు లో వెళ్తున్న ఆయనపై ఆగంతుకులు కాల్పు లు జరపడంతో మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం వరిగుంతం శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
హత్యకు భూ వివాదాలే కారణంగా తెలుస్తున్నది. ఓ స్థలం సెటిల్‌మెంట్ విషయంలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబంతో తగాదాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ తగాదాలే హత్యకు దారితీసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొల్చా రం మండలం పైతర గ్రామానికి చెందిన మారెల్లి అనిల్(28) కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మెదక్ జిల్లా నాయకుడిగా పని చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాం ధీ భవన్‌లో సమావేశానికి హాజరయ్యారు.
కారులో తిరుగుపయనం అయ్యారు. ఈ క్రమంలో వరిగుంతం శివారులోకి రాగానే అప్పటికే అతడి కారుని వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు కారును ఆపి అతి సమీ పం నుంచి కాల్పులు జరిపారు. దీంతో అక్కడిక్కడే అనిల్ మృతి చెందారు. ముందు రోడ్డు ప్రమాదంగా భావించిన స్థానికులు మెదక్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
కానీ మృతుడి శరీరంపైన బుల్లెట్ గాయాలు ఉన్నాయని వైద్యులు తెలపడం తో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన స్థలంలో పరిశీలించగా నాలుగు బుల్లెట్లు లభ్యం అయ్యాయి. దీంతో ప్రమాదం కాదని హత్య కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు చేరుకొని పరిశీలించారు. మెదక్ ఏరియా ఆసుప త్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
భూ తగాదాలే కారణమా?
హైదరాబాద్‌లోని ఓ ప్రాంతానికి చెందిన భూమి విషయంలో అనిల్ సెటిల్మెంట్ చేస్తున్నాడని సమాచారం. ఈ భూ తగాదా విష యంలో కక్ష్య పెంచుకున్న వారే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని స్థానికులు, అనిల్ సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అనిల్‌ను పక్క ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తున్నది. పార్టీ కార్యక్రమ నిర్వహణలో భాగంగా గాంధీభవన్ వెళ్లిన అనిల్ ను అక్కడి నుంచే వెంబడించినట్లు తెలుస్తోం ది. అనిల్ తన గ్రామానికి చేరుకునే సమయంలో ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి నిర్మా నుష్యంగా ప్రదేశంలో కారును ఆపి, కాల్పు లు జరిపినట్లు తెలుస్తోంది.
చేతిపై ఫోన్ నంబర్ ఎవరిది?
హత్యకు గురైన అనిల్ చనిపోయే ముం దు తన ఎడమ చేతిపై ఓ ఫోన్ నంబర్ రాసినట్లు పోలీసులు చెపుతున్నారు. అసలు ఆ ఫోన్ నంబర్ ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబానికి, అనిల్‌కు గత కొద్దిరోజులుగా ఓ భూమి విషయంలో వివాదం ఉన్నట్లు సమాచారం.
ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద రూ.80 లక్షలతో పాటు ప్రస్తు తం ఉన్న కారు తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. గత ఐదు నెలలుగా బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుందని తెలిసింది.
సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం: ఎస్పీ
నేత అనిల్ హత్యకు సంబంధించి సమగ్ర విచారణ జరుపుతున్నామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కాల్పులకు రియల్ ఎస్టేట్ వ్యాపారమే కారణమా లేక మరేదైన కారణాలు ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. మృతుడి చేతిపై ఉన్న ఫోన్ నంబర్ గురించి విచారణ చేస్తున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు.