27-01-2026 06:06:27 PM
జిల్లా ఇంచార్జీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం జిల్లా ఇంచార్జీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... అతి త్వరలో జరగబోయే దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో 20కి 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ, దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల అవసరాలు, సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు చూపడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
ప్రతి వార్డులో పార్టీ బలాన్ని పెంచి ప్రజల మద్దతు సంపాదించాలని సూచించారు. అనంతరం ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంజూరైన స్కూటీలు, వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు దివ్యాంగులకు, వికలాంగులకు, మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.