13-11-2025 01:02:11 AM
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస
బోథ్‌లో ప్రొటోకాల్ రగడ
ఆదిలాబాద్, నవంబర్ 12(విజయక్రాంతి)/బోథ్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ ఎస్ నేతల మధ్య నెలకొన్న ప్రోటోకాల్ రగడ.. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకునే స్థాయి కి చేరుకున్నది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగింది. బోథ్‌లోని రైతు వేదికలో బుధవారం బోథ్, నేరడిగొండ మండ లాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.
బోథ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు ప్రొటోకాల్ ప్రకారం పలువురు ప్రజాప్రతినిధులను వేదిక మీదకు ఆహ్వానించారు. ఎమ్మెల్యేతోపాటు బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ పీ, మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్‌లు సైతం స్టేజిపై కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో స్టేజీపై ఉన్న మాజీ ప్రజా ప్రతినిధుల పేర్లు పలకడంతో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రొటోకాల్ ప్రకారం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రమే స్టేజిపై ఉండాలని, కానీ మాజీలను స్టేజీపై ఎలా కూర్చోబెడతారని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి బల్లను గుద్ది వాదించారు. ఎమ్మెల్యే కూడా బల్లను గుద్ది బదులివ్వడంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నెలకొన్నది. ఈ క్రమంలోనే ఇరుపార్టీల నేతలు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణ లు చేసుకుంటూ తోపులాటకు దిగారు.
కొందరు కుర్చీలు లేపి విసిరే ప్రయత్నం చేశారు. తోపులాటలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల వారిని చెదరగొట్టి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే తమ కార్యకర్తలను కొట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు రైతు వేదిక ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
దీంతో పరిస్థితి చేయి దాటకుండా డీఎస్పీ జీవన్‌రెడ్డి రం గంలోకి దిగి, బోథ్ సీఐ గురుమూర్తి, ఇచ్చో డ సీఐ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. బోథ్ పోలీస్ స్టేష న్‌లో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
బీఆర్‌ఎస్ నేతలు దాడి చేయలేదు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
కాంగ్రెస్ నాయకులే కుట్రపూరితంగా దాడికి పాల్పడ్డారని, ఇందులో బీఆర్‌ఎస్ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే రెచ్చగొట్టి గొడవలకు పూనుకున్నారని, ఇది కాంగ్రెస్‌కు అలవాటేనని ఎమ్మెల్యే విమర్శించారు.