04-11-2025 12:00:00 AM
-భారీగా నష్టాలు రావడం, అప్పులు తీర్చలేక ఆత్మహత్య
-రివాల్వర్‌తో కాల్చుకున్న కానిస్టేబుల్
-సంగారెడ్డి జిల్లా మహబూబ్‌సాగర్ చెరువు కట్ట వద్ద ఘటన
సంగారెడ్డి, నవంబర్ 3(విజయక్రాంతి): ఆన్‌లైన్ గేమ్స్‌కి బానిసై ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సోమవారం సంగారెడ్డిలో చోటు చేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై భారీగా డబ్బులు పొగొట్టుకోవడంతోనే అత ను బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల కేంద్రానికి చెందిన సందీప్(28) సంగారెడ్డి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం మహబూబ్ సాగర్ చెరువుకట్టపైకి వెళ్లిన సందీప్ తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. కాగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడి కానిస్టేబుల్ సందీప్ భారీగా డబ్బులు నష్టపోయినట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ ఆడేందుకు తన సహచర కానిస్టేబుళ్ల దగ్గర భారీగా అప్పులు చేసినట్లు సమాచారం. అయితే, అప్పుగా ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో సందీప్ ఆత్మహ త్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. కాగా కానిస్టేబుల్ మృతికి గల కారణాలను తెలుసు కుంటున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఈ ఘటనకి సంబం ధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.