24-08-2025 12:43:20 AM
సూర్యాపేట, ఆగస్టు 23 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో వరుస వివాహాలు చే సుకుంటూ ఓ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకుగా చలామణి అవుతున్న ఉదంతం వెలు గులోకి వచ్చింది. అతను చేసుకున్న నాలుగు పెళ్లిళ్లలో ఓ మైనర్ బాలిక ఉండటం గమనార్హం. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.తాజాగా ఆ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదైంది.
సూర్యాపేట జిల్లాలోని నడిగూడ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వరిస్తున్న కృష్ణంరాజు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అతను వరుసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకోగా మూడో వివాహం సూర్యాపేట మండలానికి చెందిన మైనర్ బాలికతో అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ నరసింహ స్పందించి వారం రోజుల క్రితం కానిస్టేబుల్ కృష్ణంరాజుని సస్పెండ్ చేశారు. మైనర్‌ని పెళ్లి చేసుకున్న ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
కానిస్టేబుల్ వివాహం చేసుకున్న బాలిక వయసు 13ఏళ్లు కావడంతో ఆమె తల్లి నుంచి ఫిర్యాదు తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎసై బాలునాయక్ తెలిపారు. చివ్వెంల మండలానికి చెందిన కృష్ణంరాజు గతంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో పనిచేసిన సమయంలో ఇసుక | వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నడిగూడెం ఠాణాలో నియమించగా ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.