24-08-2025 12:42:52 AM
సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాసరావు
వనపర్తి, ఆగస్టు 23 (విజయక్రాంతి): ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి, పారదర్శక పాలన అందించేలా చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ర్ట సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం-2005పై పీఐఓలు, ఏపీఐఓ లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
పౌర సమాజంలో అనేక వ్యక్తుల ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సమాచార హక్కు చట్టం అని తెలిపారు. పీఐఓలు, ఏపీఐవోలు ఈ చట్టాన్ని అర్థం చేసుకొని నిర్దిష్టంగా అమలు చేసి దేశంలోనే ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేలా చేయాలని సూచించారు. గత మూడున్నరేళ్లుగా సమాచార కమిషనర్ల నియామకం లేకపోవడంతో చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని జిల్లాల పర్యటన ద్వా రా అందరికీ అవగాహన కల్పించి, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సమావేశానికి మరో ఇద్దరు సమాచార కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, వైష్ణవి మేర్ల హాజరయ్యారు. జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న సమాచార కమిషనర్లకు అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్, యాదయ్యలు పూల మొక్కలను బహుకరించి స్వాగతం పలికారు. అనంతరం వారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.