26-08-2025 12:33:42 AM
ప్రయాణికురాలి నుంచి ఐఫోన్ చోరీ చేసిన వైనం
ఈ నెల 23న ఘటన
బావమరిదితో కలిసి దొంగతనం
మహబూబాబాద్, ఆగస్టు 25 (విజయ క్రాంతి): దొంగతనాల నుంచి ప్రజలను రక్షించాల్సిన పోలీస్ దొంగగా మారి ప్రయాణికురాలి సెల్‌ఫోన్ అపహరించిన ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జీఆర్‌పీ సీఐ అంజలి, ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు ఈనెల 23న హైదరాబాదుకు చెందిన ఓ యువతి సింహపురి ఎక్స్‌ప్రెస్ లో విజయవాడ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో డోర్నకల్ స్టేషన్‌కు వచ్చేసరికి ఆమె ఐఫోన్ -15 చోరీకి గురైందని గుర్తించి, రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులపై అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఫిర్యాదు ఇచ్చింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన జీఆర్పీ పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసింది తామేనని అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే ఇందులో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తుల్లో ఒకరైన యారమడి రవీందర్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడన్నారు. గతంలో కూడా జీఆర్పీ పోలీసుగా విధులు నిర్వహించినప్పుడు జల్సాలకు అలవాటు పడి ప్రయాణికుల సెల్‌ఫ్లోనను అపహరించేవాడు. అతని బావమరిది నాగ సాయితో కలిసి ప్రయాణికురాలి సెల్‌ఫోన్ దొంగిలించినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.